Skip to main content

nallasamachar.com

‘ముడుమాల్‌’కు వరల్డ్‌ హెరిటేజ్‌ ట్యాగ్‌!

తెలంగాణకు మరో ప్రపంచ వారసత్వ హోదా దక్కేలా నిపుణులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. నారాయణపేట జిల్లా ముడుమాల్‌లోని దాదాపు మూడున్నర వేల ఏళ్ల నాటి ఆదిమానవుల స్మారక శిలల ప్రాంగణంలో నాటి మానవుల మనుగడకు సంబంధించిన ఆనవాళ్ల కోసం జాతీయ భూ¿ౌతిక పరిశోధన సంస్థ (ఎన్‌జీఆర్‌ఐ) ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో జల్లెడ పట్టబోతోంది. ఆధారాల జాడ తెలిసిన తర్వాత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నిపుణులు తవ్వకాలు జరిపి వాటిని వెలికితీయనున్నారు.

ఆ ఆధారాలతో ప్రపంచ వారసత్వ హోదా కోసం యునైటెడ్‌ నేషన్స్‌ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్‌ అండ్‌ కల్చరల్‌ ఆర్గనైజేషన్‌ (యునెస్కో)కు దరఖాస్తు చేయనున్నారు. రాష్ట్రంలో ఇప్పటికే రామప్ప దేవాలయానికి యునెస్కో వరల్డ్‌ హెరిటేజ్‌ ట్యాగ్‌ దక్కిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో ఆ ఘనత పొందిన ఏకైక కట్టడం ఇదే. ఇప్పుడు ముడుమాల్‌ గ్రామ శివారులో దాదాపు మూడున్నర వేల ఏళ్ల నాటి స్మారక శిలల ప్రాంగణం కూడా ఆ హోదా దక్కించుకునే ప్రయత్నంలో ఉన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే యునెస్కో తాత్కాలిక ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో దానికి చోటు దక్కింది. తుది జాబితాలో చోటు పొందటం ద్వారా అత్యంత ప్రతిష్టాత్మక వరల్డ్‌ హెరిటేజ్‌ ట్యాగ్‌ కైవసం చేసుకునేందుకు పురావస్తు శాఖ, ఓ ప్రైవేటు సంస్థ ఆధ్వర్యంలో నిపుణులు ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపి అది ఏ కాలానికి సంబంధించిందో కచ్చితమైన కాలాన్ని తేల్చటంతోపాటు, ఆ కాలంలో ఆదిమానవులు వాడిన వస్తువుల ఆనవాళ్లను గుర్తించబోతున్నారు.

ఆ ఆధారాలే కీలకం
ముడుమాల్‌ ఆదిమానవుల స్మారక శిలలు (దాదాపు 15 అడుగుల ఎత్తున్న నిలువురాళ్లు) ఉన్న ప్రాంతం కేవలం నాటి మానవులు చనిపోయినప్పుడు ఏర్పాటు చేసిన స్మారక శిలల ప్రాంగణంగానే కాకుండా అప్పట్లో దాన్ని ఖగోళ పరిశోధన ప్రాంతంగా వినియోగించారని నిపుణులు గుర్తించారు. ఆ నిలువు రాళ్ల నీడల ఆధారంగా వాతావరణంలో మార్పులు, కాలాలు, తుపానులు, ఇతర ప్రకృతి విపత్తుల గుర్తింపునకు దీన్ని వాడారని తేల్చారు. అందుకు ఆధారాలు గుర్తించారు.

Share Now:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *